Hero Image

Bengaluru: వాష్రూం కోసమని వచ్చి..టెకీపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు అది పీడకలను మిగిల్చింది. ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చిన బాయ్.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అర్జెంట్‌గా బాత్‌రూమ్ వస్తుందని లోపలికి వచ్చి అడ్వాంటేజ్‌గా తీసుకుని లైంగిక దాడికి ప్రయత్నించాడు. చివరకు ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యాడు.
ఈ ఘటన బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని ఏఈసీఎస్ లేఅవుట్‌లో మార్చి 17న చోటుచేసుకుంది. తనకు ఎదురైన ఈ భయానక అనుభవాన్ని బాధితురాలు తెలియజేసింది.బాధిత టెక్కీ (30) మాట్లాడుతూ.. ‘మార్చి 17న సాయంత్రం 6.45 గంటలకు తమ నివాసం ఉండే ప్రాంతానికి సమీపంలో రెస్టారెంట్ నుంచి దోశ ఆర్డర్ చేశాను. పార్శిల్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌ను మంచి నీళ్లు తాగుతావా? అని కనీస మర్యాదగా అడిగాను. సరేనని అనడంతో మంచినీళ్లు తీసుకొచ్చి ఇస్తే తాగేసి వెళ్లిపోయాడు. కానీ, కొద్ది సెకెన్లకు వెనక్కి వచ్చిన అతడు..
మా ఇంటి తలుపు తట్టాడు.. తలుపు తెరిచి ఏమైందని అడిగితే మేడమ్ అర్జెంట్‌ అని వాష్‌రూమ్ వాడుకోవచ్చా? అని అడిగాడు... అంత ప్రాధేయపడి అడగటంతో సరేనని తలుపు దగ్గర వేచి ఉండమని అడిగాను. ఆశ్చర్యకరంగా అతడు వంటగదిలోకి నా వెనుకే వచ్చాడు.. నాకు అర్థం కాని విధంగా ఏదో గొణిగాడు.. అతను వంటగదికి ఎందుకు వచ్చాడో అనుకునేలోపు నా చేయి పట్టుకున్నాడు.. దీంతో షాకయ్యాను.. అరుస్తుంటే ఇంకా వాడు నా చెయ్యి పట్టుకుని లాగుతున్నాడు.. వెంటనే అక్కడ ఉన్న పాన్ తీసుకుని వాడి వీపు మీద కొట్టాను.
ఇంటి నుంచి బయటకు పరుగులు తీశాడు. నేను అతని వెనుక లిఫ్ట్ వరకు పరిగెత్తాను, కాని అతను మెట్లు ఎక్కి తప్పించుకున్నాడు’ అని వాపోయింది.గడ్డంతో ఉన్న అతడు మాస్క్ వేసుకున్నాడని చెప్పింది. బాధితురాలు అనిత (పేరు మర్చాం) 112 హెల్ప్ లైన్‌కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. హెచ్ఏఎల్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ‘డెలివరీ బాయ్ నాతో హిందీ, ఇంగ్లీషులో మాట్లాడాడు.. కానీ కిచెన్‌లోకి వచ్చినప్పుడు ఏ భాషలో మాట్లాడాడో నాకు ఖచ్చితంగా తెలియదు’ అని అనిత చెప్పింది.ఈ ఘటనతో డెలివరీ బాయ్స్‌ను లోపలికి రానివ్వద్దని అపార్ట్‌మెంట్ వాసులు నిర్ణయించారు.
గేటు వద్దే ఆర్డర్లు ఇచ్చి వెళ్లాలని బోర్డు పెట్టారు. భవనం సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. నిందితుడ్ని ఆకాశ్‌గా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నారు. టెకీ మాట్లాడుతూ.. ‘నా ఫిర్యాదుపై ఫుడ్ డెలివరీ సంస్థ త్వరగా స్పందించలేదు. నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా అతడి మొబైల్ నంబర్, ఇతర వివరాలను ఇవ్వలేదు.. నేను కస్టమర్ కేర్‌తో కాల్‌లో ఉన్నప్పుడు, కంపెనీ పేరు రాయమని ఒక పోలీసు అధికారి చెప్పడం విన్న ఆ తర్వాత అతడి ఫోన్ నంబర్‌ను చెప్పారు’ అని అనిత చెప్పారు.

READ ON APP