Hero Image

Brahmamudi Today ఏప్రిల్ 30 ఎపిసోడ్: స్టేషన్లో కవి, అప్పూ రొమాన్స్! విజిల్స్ పడే సీన్ అనిమాట

Brahmamudi 2024 April 30 Episode: కనకం అయితే.. దుగ్గిరాల వారి నట్టింట్లో తాండవం ఆడేసింది. అక్కడే కూర్చుని.. ‘ఈ రాత్రి గడవక ముందే.. నా బిడ్డ అప్పూ నా ముందు ఉండాలి.. లేదంటే ఏ శక్తీ నన్ను ఇక్కడ నుంచి ఇంచుకూడా కదపలేరు.. కబడ్దార్ ధాన్యలక్ష్మీ’ అంటూ ఛాలెంజ్ విసురుతుంది కనకం. ఆ సమయంలో కనకం ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోతాయి. ఇక సీన్ కట్ చేస్తే..
కావ్య.. రాజ్‌ని తీసుకుని అనామిక వాళ్ల అమ్మనాన్నల దగ్గరకు వెళ్లింది అనుకున్నాం కానీ.. నిజానికి రాజ్, కావ్య పోలీస్ సేషన్‌ దగ్గరే ఉంటారు. అనామిక అమ్మానాన్నలే అక్కడికి వస్తారు. లేదు కావ్యే రప్పిస్తుంది వాళ్లని. మొదట పొగరుగా మాట్లాడిన ఆ శైలు, సుబ్బూలు.. కళావతి దెబ్బకు దారిలోకి వస్తారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.
రాజ్ రిక్వస్ట్..

‘ఏం మాట్లాడుతున్నారు సార్(రాజ్) మీరు? నా కూతురికి ఎంత కష్టం వస్తే ఈ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి ఉంటుంది?’ అంటాడు సుబ్బూ కోపంగా కళావతి, రాజ్‌లతో.

‘మీ కూతురు కష్టానికి కారణాలు వెతుక్కుంటుంది. చిన్న విషయాన్నే బూతద్దంలో చూస్తోంది’ అంటుంది కావ్య. ‘అంటే మీ చెల్లెలు అప్పూ తప్పేం లేదని అంటావా?’ అంటుంది శైలు. ‘లేదనే అంటాను’ అంటుంది కావ్య. ‘మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. వాళ్లిద్దరూ మొదటి నుంచి మంచి స్నేహితులు మాత్రమే.. అనామిక చెప్పింది విని మీరు అపార్థం చేసుకుంటే ఎలా?’ అంటాడు రాజ్ రిక్వస్ట్‌గా.


రెచ్చిపోయిన అనామిక పేరెంట్స్..

‘అపార్థం చేసుకున్నామో అర్థం చేసుకున్నామో.. నా కూతురు మీ ఇంట్లో మాత్రం సుఖంగా లేదు. కళ్యాణ్ అప్పూ మీద మోజుతో నా కూతుర్ని వదిలించుకోవాలని చూస్తున్నాడు. కోర్టుకు వెళ్తే తప్ప న్యాయం జరిగేలా లేదు’ అంటాడు సుబ్బూ. ‘కోర్టుల దాకా వెళ్తే ఎవరికి నష్టం చెప్పండి. మీ అమ్మాయి కాపురం గురించి కూడా మీరు ఆలోచించాలి’ అంటాడు రాజ్. ‘అప్పుడు కానీ మా అమ్మాయి జీవితం బాగుపడదు. అప్పూ పీడ విరగడైపోతుంది. మా అల్లుడు కూడా మా దారికి రాడు’ అంటుంది శైలు.


కళావతి ట్రీట్‌మెంట్ మొదలు..

‘దారికి రాడు.. జైలుకే వెళ్తాడు. తిరిగి వచ్చాక.. ఇంత చేసిన మీ కూతురితో సవ్యంగా కాపురం చేస్తాడా? అతడు జైలుకి వెళ్లిన మరుక్షణం మీ అమ్మాయిని మా ఇంట్లో ఉండనిస్తారా?’ అంటుంది కావ్య. ‘నీ తెలివి నాకు తెలుసులే.. నువ్వే నీ చెల్లెలితో ఈ నాటకం ఆడిస్తున్నావ్.. అనామికను కళ్యాణ్‌కి దూరం చేసి.. అప్పూని కట్టబెట్టాలని చూస్తున్నావ్’ అంటుంది శైలు. ‘నేనా.. హూ.. ఇంత సేపు ఒక ఆడపిల్ల తల్లిదండ్రులతో మాట్లాడుతున్నా అనుకుంటున్నాను.

అసలు మా చెల్లెల్నే ఇచ్చి చెయ్యాలి అనుకుంటే.. అసలు అనామికతో ఈ పెళ్లే జరిగి ఉండేదే కాదు’ అంటుంది కావ్య.


రెచ్చిపోయిన రాజ్ గారి భార్య..

తల దించుకుని వింటూ ఉంటారు శైలు, సుబ్బూలు. ‘అనామిక, కళ్యాణ్‌ల పెళ్లి రోజున అప్పుల వాడు వచ్చి.. 2 కోట్లు ఇస్తేనే పెళ్లి జరగనిస్తా అంటే.. నేను విని.. వెళ్లి నా భర్తతో చెప్పి తనని తీసుకొచ్చాను. ఆయన ఆ డబ్బు కడితే మీ అమ్మాయి పెళ్లి జరిగింది అన్న విషయం అప్పుడే మరిచిపోయారా?’ అంటుంది కావ్య కోపంగా.

‘కళావతీ.. ఇప్పుడు అవన్నీ ఎందుకు?’అంటాడు రాజ్. ‘కావాలి.. ఇప్పుడే అవన్నీ బయటపెడతాను. వీళ్ల బతుకులు ఏంటో వీళ్లకు అర్థమయ్యేలా చేస్తాను. నేను నిజంగానే నా చెల్లెలు గురించి ఆలోచించి ఉంటే.. ఆ రోజే ఆ అప్పుల వాడ్ని రెచ్చగొట్టి మండపానికి పంపేదాన్ని’ అంటుంది కావ్య కోపంగా వాళ్లతో.


అబ్బబ్బే మాకేం తెలియదు.. మాకేం తెలియదు..

‘ఈ మాత్రం ఇంకితం లేని మీరు నా గురించి నా చెల్లెలు గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? ఇన్నేళ్లు వచ్చాయి ఎందుకు..? ఏట్లో పెట్టనా గూట్లో పెట్టనా? ఇప్పుడు ఏంటి మీ అమ్మాయితో చెప్పి కేసు వెనక్కి తీసుకునేలా చేస్తారా లేదా? కూతురు తెలిసి తెలియని తనంతో కాపురం కూల్చుకుంటుంటే..

సద్దిచెప్పలేని మీరు తల్లిదండ్రులేనా? లేదంటే దీని వెనుక మీ హస్తం కూడా ఉందా? మీ ముఖాలు చేస్తే కచ్చితంగా ఉందనే అనిపిస్తోంది’ అంటుంది కావ్య కోపంగా అనామిక పేరెంట్స్‌తో. బిత్తరపోతారు వాళ్లు. ‘అబ్బబ్బే మాకేం తెలియదు’ అంటాడు సుబ్బూ కంగారుపడుతూ.


పెళ్లినాటి రచ్చను గుర్తు చేస్తూ..

‘మీకు తెలుసో లేదో ఇంకాసేపట్లో బయటపడుతుంది. మీరు ఎవరికీ తెలియకుండా మా ఆయన దగ్గర తీసుకున్న ఆ రెండు కోట్ల విషయం కూడా అందరికీ తెలిసిపోతుంది.

నా భర్త తలుచుకుంటే ఒక్క ఫోన్ కాల్ చాలు.. నువ్వు నీ భార్య నీ కూతురు లోపలికి వెళ్లి.. నా మరిది.. నా చెల్లెలు బయటికి రావడానికి.. కానీ ఆయన ఓపిక పడుతున్నారు. మిమ్మల్ని బతిమలాడుతున్నారు. ఎందుకు ఏం చేయలేకనా? ఆయనే గనుక ఏదైనా చెయ్యాలి అనుకుంటే.. మీరంతా పూచుకపుల్లలా కొట్టుకునిపోతారు.. రోడ్డుపడతారు.. బీ కేర్ ఫుల్’ అంటుంది కళావతి కోపంగా.


కాళ్లబేరానికి సుబ్బూ..

‘కళావతీ ఏంటిది?’ అంటాడు రాజ్ కంగారుగా.

‘లేకపోతే ఏంటండీ.. అయినా ఇవన్నీ వాళ్లతో చెప్పండం ఎందుకు.? మనం చెయ్యాల్సింది మనం చేద్దాం.. వీళ్ల బండారం మొత్తం బయటికి లాగుదాం.. మీరు రండి’ అంటుంది కావ్య రాజ్‌ని స్టేషన్‌లోపలికి పిలుస్తూ కావాలనే. ‘అమ్మమ్మమ్మా.. ఆగమ్మా.. ఏంటమ్మా ఇది. అయినా అయినవాళ్ల మధ్య కోపతాపాలు శాశ్వతంగా ఉంటాయా? మీరు అంటుంటే అర్థమవుతుంది. మా అమ్మాయిదే తప్పు.. మేము పిలిచి గడ్డిపెడతాం కదా?’ అంటూ కాళ్లబేరానికి వస్తాడు సుబ్బూ. శైలు కూడా బిక్క ముఖం వేసి.. షాక్ అయిపోతూ చూస్తుంది.


అనామిక వెంటనే పోలీస్ స్టేషన్‌కి రా..

‘మీరు పచ్చగడ్డే పెట్టుకుంటారో.. ఎండు గడ్డే పెట్టుకుంటారో.. మాకు అనవసరం. మర్యాదగా వచ్చి కేసు వెనక్కి తీసుకుంటే సరే సరి. లేదంటే ఎక్కడికి వెళ్లాలో అక్కడికే వెళ్తాం’ అంటుంది కళావతి. ‘అయ్యయ్యో.. మా అనామిక చెప్పింది విని మేము అపార్థం చేసుకున్నాం తప్ప మాకు ఎవరి మీద ఎలాంటి కోపం లేదమ్మా.. ఇప్పుడే మా అనామికను పిలుస్తాం’ అంటుంది శైలు రిక్వస్ట్‌గా. ‘ఆ పని త్వరగా చెయ్యండి.

పిలిపించండి ఆ మ..హా..రాణిని.. ఒప్పించండి’ అంటుంది కావ్య. సరే అంటూ పక్కకు పోయి.. అనామికను వెంటనే కాల్ చేసి.. ‘ఏం మాట్లాడకుండా పోలీస్ స్టేషన్‌కి రా’ అంటారు అనామిక పేరెంట్స్. ఏదో చెప్పబోయినా అనామిక మాటను వారు వినరు.


నీలో కనిపించని రౌడీ దాగి ఉంది

‘హేయ్ కళావతీ.. అలా మాట్లాడతావేంటీ?’ అంటాడు రాజ్ చిన్నగా. ‘అలా మాట్లాడితే కదా.. మొదట రెచ్చిపోయిన మనుషులు ఇలా దారికి వచ్చారు’ అంటుంది కావ్య. ‘నీలో కనిపించని రౌడీ దాగి ఉంది’ అంటాడు రాజ్.

‘అప్పూ కనిపిస్తుంది నేను కనిపించనంతే. లేకపోతే దేవుడు లాంటి కవిగారిని.. వీళ్ల(శైలు, సుబ్బూ) మూలంగానే అనామిక టార్చర్ పెడుతుంది’ అంటుంది కళావతి. ఇక కాసేపటికి అనామిక అక్కడికి వస్తుంది. ‘ఏమైంది మీకు. ఇప్పుడు ఎందుకు రమ్మారు?’ అంటుంది తల్లిదండ్రులతో. ‘కేసు వెనక్కి తీసుకోవాల్సిందే. లేదంటే మనం లోపలికి వెళ్లే పరిస్థితి వచ్చింది’ అంటాడు సుబ్బూ కూతురితో.


కలిసే ప్లాన్ చేశాం కానీ..

‘అంతా కలసే ప్లాన్ చేశాం కదా డాడీ?’ అంటుంది అనామిక అయోమయంగా.

‘అవునమ్మా మనం కలిసే ఈ కుట్రకు ప్లాన్ చేశాం కానీ.. ఇప్పుడు తగ్గకపోతే ప్రమాదాలు జరిగేలా ఉన్నాయి. ఆ కావ్య మామూలు ఆడది కాదు..’ అంటూ అనామికకు నచ్చజెప్పి.. స్టేషన్ ముందున్న కావ్య, రాజ్‌ల ముందుకు తీసుకుని వెళ్తారు. అనామిక అయిష్టంగానే సుబ్బూ, శైలుల వెనుక వెళ్తుంది. ‘అమ్మా, బాబు.. మా అమ్మాయి వచ్చేసింది’ అంటాడు సుబ్బూ.. కావ్య, రాజ్ వాళ్లతో. ‘వస్తే సరిపోదు. వాళ్లను బయటికి తీసుకొస్తే బాగుంటుంది’ అంటుంది కళావతి కోపంగా.

READ ON APP