Hero Image

Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల చరిత్రలో రికార్డ్.. మార్చి 1 నుంచి రోజుకు రూ.100 కోట్లు సీజ్

Lok Sabha Elections: సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు డబ్బు, మద్యం ఏరులై పారుతుంది. ఓటర్లకు పంచడానికి, ప్రచారానికి, కార్యకర్తల ఖర్చులకు, సభలు, సమావేశాలకు డబ్బు ఉంటేనే పని జరుగుతుంది. దీంతో ఎన్నికల సమయంలో వందలు, వేల కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. ఇక ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం.. ప్రత్యేక నిఘా వేసి నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్తున్న డబ్బును సీజ్ చేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన గత 45 రోజుల్లో ఏకంగా రూ.4650 కోట్లు పట్టుబడినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. ఇది 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే అత్యధికమని పేర్కొన్నారు. అయితే ఎన్నికలకు ఇంకా చాలా రోజుల సమయం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి 1 వ తేదీ నుంచి ఏప్రిల్‌ 13 వ తేదీ వరకు 45 రోజుల్లో మొత్తం రూ.4650 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
అంటే రోజుకు రూ.100 కోట్ల మేర సీజ్ చేసినట్లు పేర్కొంది. ఇక ఈ రూ.4650 కోట్లలో డబ్బు, బంగారం, వెండి, మద్యం, ఇతర విలువైన వస్తువులు, డ్రగ్స్ ఉన్నట్లు ఈసీఐ వెల్లడించింది. అందులో డబ్బు రూ.395.39 కోట్లు కాగా, రూ.562.10 కోట్ల విలువైన బంగారం, వెండి, ఇతర లోహాలు స్వాధీనం చేసినట్లు తెలిపింది. మరోవైపు.. రూ.489.31 కోట్ల విలువ చేసే 3.58 కోట్ల లీటర్ల మద్యం తనిఖీల్లో పట్టుబడినట్లు వివరించింది. ఇక పట్టుబడిన వాటిలో అత్యధిక శాతం డ్రగ్స్ ఉన్నట్లు తెలిపింది. రూ.4,650 కోట్లలో 45 శాతం మేర రకరకాల మత్తుపదార్థాలు ఉన్నట్లు వెల్లడించింది.
ఇప్పటివరకు రూ.2,068.85 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది. 2019 సార్వత్రిక ఎన్నికల వేళ రూ. 1,279.9 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుకున్నారు. ఇవే కాకుండా టీవీలు, ఫ్రిడ్జ్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, బహుమతుల రూపంలో ఇచ్చే వస్తువులు కలిపి మరో రూ. 1,142.49 కోట్ల విలువైన సామాన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ వివరించింది. 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక మొత్తమని అందులో ఈసీ వెల్లడించింది. 2019 ఎన్నికల్లో పట్టుబడిన మొత్తం వస్తువులు, డబ్బు విలువ రూ.
3,475 కోట్లు అని కానీ.. ఈసారి ఇప్పటివరకే రూ.4650 కోట్లు దొరికినట్లు చెప్పింది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది 34 శాతం ఎక్కువ అని తెలిపింది. రాష్ట్రాల వారీగా చూస్తే.. రాజస్థాన్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో రూ. 778.52 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్ రూ. 605 కోట్లు.. తమిళనాడు రూ.460.8 కోట్లు.. మహారాష్ట్ర రూ.431.3 కోట్లు.. పంజాబ్‌ రూ. 311.8 కోట్లు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి రూ. 121.84 కోట్లు.. ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 125.97 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలుస్తోంది.

READ ON APP