Hero Image

ధోనీ క్రేజ్ చూసి డికాక్ భార్య షాక్.. చెవుడు ఖాయం, సోషల్ మీడియాలో ఫోటో వైరల్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ స్టార్‌ ప్లేయర్‌ ఎంఎస్‌ ధోనీ హవా కొనసాగుతోంది. గత రెండు సీజన్‌లలో బ్యాటింగ్‌లో మోస్తరు ప్రదర్శన చేసిన ధోనీ.. ఈ సీజన్‌లో మాత్రం చెలరేగిపోతున్నాడు. ఇన్నింగ్స్‌ చివర్లో బ్యాటింగ్‌కు వస్తూ.. సిక్స్‌లు, ఫోర్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు.
ముంబైతో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లు కొట్టిన ధోనీ.. లక్నోతో మ్యాచ్‌లో 9 బంతుల్లో 28 రన్స్‌ చేశాడు. విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లోనూ 16 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు.ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు సైతం వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే మ్యాచ్‌ను చూసేందుకు ఫ్యాన్స్‌ స్టేడియానికి పోటెత్తుతున్నారు. వేదిక ఏదైనా..
స్టేడియాలు మాత్రం పసుపు పచ్చగా మారిపోతున్నాయి. ధోనీకి మద్దతు తెలిపేందుకు, అతడిని చూసేందుకు ఫ్యాన్స్‌ ఆసక్తి చూపుతున్నారు.శుక్రవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో సీఎస్కే ఓడినా.. ధోనీ ఫ్యాన్స్‌ మాత్రం కుషీ అయ్యారు. ఈ మ్యాచ్‌ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. తనదైన శైలిలో చెలరేగి ఫ్యాన్స్‌ను అలరించాడు. 9 బంతుల్లో 28 రన్స్‌ చేశాడు. జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు.
ఇక ధోనీ క్రీజులోకి వచ్చే క్రమంలో ఏకనా స్టేడియం హోరెత్తిపోయింది. ధోనీ నామస్మరణతో మార్మోగిపోయింది. ధోనీకి ఉన్న క్రేజ్‌ను చూసిన లక్నో సూపర్‌ జెయింట్స్ స్టార్‌ ప్లేయర్‌ క్వింటన్ డికాక్ భార్య సాషా షాక్‌ అయింది. ఇదెక్కడి ఫాలోయింగ్‌ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మేరకు తన సోషల్‌ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టింది.“మహేంద్ర సింగ్‌ ధోని బ్యాటింగ్‌ చేసేందుకు మైదానంలోకి వస్తున్నప్పుడు నా స్మార్ట్‌ వాచ్‌లో నమోదైన దృశ్యమిది.
ధ్వని తీవ్రత 95 డెసిబల్స్‌ను తాకింది, చుట్టూ భారీ శబ్దాలతో కూడిన వాతావరణం, ఒక్క 10 నిమిషాల పాటు ఇదే వాతావరణం కొనసాగితే.. తాత్కాలిక వినికిడి లోపం రావడం ఖాయం” అంటూ తన స్మార్ట్‌ వాచ్‌ చూపించిన సందేశాన్ని సాషా ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఒక ఎమోజీని సైతం జత చేసింది.
ఇది చూసిన నెటిజన్లు.. అదీ ధోనీ క్రేజ్‌ అంటే అని కామెంట్లు చేస్తున్నారు.

READ ON APP