Hero Image

ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదం.. విరాట్ కోహ్లీకి భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ..!

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ప్లేయర్‌, టీమిండియా రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ షాక్‌ ఇచ్చింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా అతడిపై చర్యలు తీసుకుంది. రూల్స్‌ బ్రేక్ చేశాడంటూ భారీగా ఫైన్‌ విధించింది. ఈ మేరకు మ్యాచ్‌ ఫీజులో 50 శాతం మేర కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్‌ 222/6 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అప్పటికే 2 సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టి జోష్ మీద ఉన్న కోహ్లీ.. అదే జోరు కొనసాగించాలని భావించాడు. అయితే హర్షిత్ రాణా వేసిన ఫుల్ టాస్ బంతిని అంచనా వేయలేకపోయాడు. దీంతో అతడి బ్యాటుకు తగిలిన బంతి గాల్లోకి లేవగా.. హర్షిత్ క్యాచ్ అందుకున్నాడు.
ఈ బంతి కోహ్లీ నడుం కంటే ఎక్కువ ఎత్తు వచ్చిందా అనే అనుమానంతో అంపైర్లు థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశారు.
మ్యాచ్‌ కోహ్లీ నడుం కంటే ఎక్కువ ఎత్తులోనే వచ్చినా.. కోహ్లీ క్రీజు బయట ఉండటం.. బంతి క్రీజులోకి వచ్చేసరికి ఎత్తు తగ్గడంతో అంపైర్‌ ఔట్‌ అని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో అసంతృప్తికి గురైన విరాట్.. అంపైర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గ్రౌండ్‌లోనే అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. మ్యాచ్‌ తర్వాత కూడా ఈ విషయంపై అంపైర్లతో మాట్లాడాడు. దీంతో కోహ్లీ తన ప్రవర్తన ఐపీఎల్‌ నిబంధనలను ఉల్లంఘించాడని బీసీసీఐ భావించింది. అతడిపై చర్యలు తీసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
ఈ సీజన్‌లో ఆడిన 8 మ్యాచుల్లో ఒక్కదాంట్లో మాత్రమే గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది.

READ ON APP