Hero Image

టీ20 ప్రపంచకప్లో చోటుపై స్పందించిన దినేశ్ కార్తిక్..!

ఓవైపు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 కొనసాగుతుండగానే.. మరో ఆరు వారాల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌పై చర్చ మొదలైంది. ముఖ్యంగా టీమిండియా జట్టు ఎంపిక చర్చనీయాంశంగా మారింది. జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది? ఎవరికి నిరాశ ఎదురవుతుంది? అనేది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా వికెట్‌ కీపర్‌ ఎంపిక కెప్టెన్, హెడ్‌ కోచ్‌, సెలక్టర్లకు తలనొప్పిగా మారింది.
ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న టీమిండియా వికెట్‌ కీపర్లలో చాలా మంది మెరుగైన ప్రదర్శన చేస్తుండటం ఈ పరిస్థితికి కారణమైంది. వెటరన్‌ వికెట్‌ కీపర్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్లేయర్‌ దినేశ్‌ కార్తిక్.. ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 35 బంతుల్లోనే 83 పరుగులు చేసి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. టీమిండియాకు ఆడే సత్తా తనలో ఇంకా ఉందని నిరూపించాడు. ప్రపంచకప్‌ జట్టు ఎంపిక రేసులో తాను ఉన్నట్లు సెలక్టర్లకు సంకేతాలు పంపించాడు.
దీనేశ్‌ కార్తిక్ ప్రదర్శనతో అతడిని ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ జట్టు ఎంపికపై దినేశ్‌ కార్తిక్‌ స్పందించాడు. తన మనసులోని మాటను వెల్లడించాడు.“నా జీవితంలో ఈ దశలో (39 ఏళ్ల వయసులో) భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమంటే గొప్పగా అనిపిస్తుంది. అందుకు నేను పూర్తి సంసిద్ధతతో ఉన్నా. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ 2024లో టీమిండియాకు ఆడడం కంటే నా జీవితంలో పెద్ద విషయం ఏమీ ఉండదు. ప్రపంచకప్‌ కోసం జట్టును ఎంపిక చేసే ముగ్గురు సభ్యులు..
హెడ్‌కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌, కెప్టెన్ రోహిత్‌ శర్మ, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తులు. వాళ్లు అత్యుత్తమ జట్టునే ఎంపిక చేస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా నేను కచ్చితంగా గౌరవిస్తా” అని దినేశ్‌ కార్తిక్ వ్యాఖ్యానించాడు.కాగా ఐపీఎల్‌ 2024 ప్రారంభానికి ముందు వరకు టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించే వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఎవరంటే.. రిషభ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, జితేశ్‌ శర్మల పేర్లు వినిపించేవి.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సంజూ శాంసన్, కేఎల్‌ రాహుల్‌లు కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. పోటాపోటీగా పరుగులు సాధిస్తున్నారు. దీంతో వికెట్‌ కీపర్‌గా ఎవర్ని ఎంపిక చేస్తారనే ఆసక్తికరంగా మారింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రేసులో రిషభ్‌ పంత్‌ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అతడికి బ్యాకప్‌గా దినేశ్‌ కార్తిక్‌ను ఎంపిక చేయాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన డీకే.. 200లకు పైగా స్ట్రైక్‌ రేట్‌తో 226 రన్స్‌ స్కోరు చేశాడు.
మరి టీమిండియా సెలక్టర్లు ఎంపిక చేసే జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

READ ON APP