Hero Image

Sarabjit Singh: ఎవరీ సరబ్జిత్ సింగ్.. భారత్ నుంచి పాక్కు వెళ్లి 22 జైలు శిక్ష అనుభవించి ఎలా చనిపోయాడు?

Sarabjit Singh: భారత్‌కు చెందిన సరబ్జిత్ సింగ్.. 22 ఏళ్లు పాకిస్థాన్‌లోని లాహోర్ జైలులో మగ్గి చివరికి అదే జైలులో ఉన్న మిగితా ఖైదీలు దాడి చేయడంతో 2013 లో ప్రాణాలు కోల్పోయాడు. పొరపాటును భారత సరిహద్దులు దాటి పాక్‌లోకి చేరడంతో అక్కడే చిక్కుకుపోయిన సరబ్జిత్ సింగ్.. తిరిగి స్వదేశానికి వచ్చేందుకు అతని సోదరి విశ్వ ప్రయత్నాలు చేసింది.
అయినప్పటికీ సరబ్జిత్ సింగ్‌ను పాక్ వదిలిపెట్టలేదు. చివరికి ప్రాణాలు కోల్పోయి మృతదేహంగా భారత్ చేరుకున్నాడు. తెలిసీ తెలియకుండా పాక్ భూభాగంలోకి అడుగుపెట్టడంతో గూఢచర్యం, ఉగ్రవాద ఆరోపణలతో పాక్ ప్రభుత్వం.. అతడిని అరెస్ట్ చేసి జైలులో ఉంచింది. ఇక సరబ్జిత్ సింగ్‌ను పాక్ అండర్ వరల్డ్ డాన్ హతమార్చడం ప్రస్తుతం పెను సంచలనంగా మారింది. తాజాగా ఆ అండర్ వరల్డ్ డాన్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 1990 నుంచి 2013 వరకు 22 ఏళ్ల పాటు లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవించిన సరబ్జిత్ సింగ్..
49 ఏళ్ల వయసులో 2013 లో ఇతర ఖైదీలు చేసిన దాడిలో మరణించాడు. అసలు సరబ్జిత్ సింగ్ ఎవరు?భారత్‌-పాక్ సరిహద్దుల్లోని పంజాబ్‌లోని తరన్ తరన్ జిల్లా బిఖివింద్ గ్రామానికి చెందిన సరబ్జిత్ సింగ్.. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. సుఖ్‌ప్రీత్ కౌర్‌ని పెళ్లి చేసుకున్న సరబ్జిత్ సింగ్‌కు స్వపన్ దీప్, పూనమ్ కౌర్ అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఇక సరబ్జిత్ సింగ్ పొరపాటున 1990 లో సరిహద్దు దాటి పాక్‌లోకి చేరుకున్నాడు. దీంతో ఆయన సోదరి దల్బీర్ కౌర్.. 1991 నుంచి 2013 వరకు..
సరబ్జిత్ సింగ్ చనిపోయే వరకు అతని విడుదల కోసం నిరంతర పోరాటం చేశారు. అయినా ఆమె చేసిన ప్రయత్నం విఫలం అయింది. సరబ్జిత్ సింగ్ పాకిస్తాన్‌కు ఎలా వెళ్లాడు?1990 ఆగస్ట్ 29 వ తేదీన సరబ్జిత్ సింగ్ పాకిస్తాన్‌లోకి అడుగుపెట్టాడు. అయితే మద్యం సేవించిన సరబ్జిత్ సింగ్.. ఆ మత్తులోనే దారి తప్పిపోయి సరిహద్దులు దాటి పాక్ భూభాగంలో అడుగుపెట్టినట్లు ఆయన కుటుంబం మొదటి నుంచి వాదిస్తోంది. అదే సమయంలో పాక్ అధికారులకు పట్టుబడటంతో వారు అరెస్ట్ చేసి విచారణ చేయడం ప్రారంభించారు.
ఇక అంతకు కొన్ని రోజుల ముందే 1990లో పాకిస్తాన్‌లోని లాహోర్, ఫైసలాబాద్‌ నగరాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో మొత్తం 14 మంది మరణించగా.. పేలుళ్లతో సరబ్జిత్ సింగ్‌ ప్రమేయం ఉన్నట్లు పాకిస్తాన్ ఆరోపించింది. దీంతో 1991లో సరబ్జిత్ సింగ్‌కు పాక్ కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో అతడిని లాహోర్‌ జైలుకు తరలించారు. సరబ్జీత్ సింగ్‌ని మంజిత్ సింగ్ మట్టు అని ఆరోపించిన పాకిస్తాన్.. గూఢచర్యం చేసినందుకు దోషిగా తేల్చి శిక్ష వేసింది. అయితే పాక్ పేలుళ్లు జరిగిన నెల తర్వాత అనుకోకుండా సరిహద్దు దాటినట్లు పేర్కొన్న భారత్..
అతడ్ని విడిపించాలని ఎన్నోసార్లు పాకిస్థాన్‌కు విజ్ఞప్తి చేసింది. వాటిని పాకిస్తాన్ పట్టించుకోలేదు. ఇక సరబ్జిత్ సింగ్‌కు క్షమాభిక్ష పెట్టాలని ఎన్నోసార్లు లాయర్లు పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ వాటిని పాక్ తిరస్కరించింది.జైలులో హత్య2013 లో సరబ్జిత్ సింగ్‌పై జైలులో దాడి జరిగింది. అతని తలపై పదునైన మెటల్ షీట్లు, ఇనుప రాడ్లు, బ్లేడ్లు, ఇటుకలతో ఆ జైలులోని తోటి ఖైదీలే తీవ్రంగా దాడి చేశారు. దీంతో సరబ్జిత్ సింగ్‌ మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా వెన్నముక విరిగిపోయి కోమాలోకి కూడా వెళ్లాడు.
దీంతో సరబ్జిత్ సింగ్‌ను లాహోర్‌లోని జిన్నా ఆస్పత్రికి తరలించి జైలు అధికారులు చికిత్స అందించారు. కానీ సరబ్జిత్ సింగ్‌ కోలుకునే అవకాశం లేదని డాక్టర్లు తేల్చారు. సరబ్జిత్ సింగ్‌ను చూసేందుకు అతని సోదరి, భార్య పాక్‌ వెళ్లగా.. అతడు కోమా నుంచి కోలుకోలేడని వైద్యులు చెప్పడంతో చేసేదేమీ లేక భారత్‌కు తిరిగి వచ్చారు. అయితే సరబ్జిత్ సింగ్‌పై అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్‌తోపాటు మరికొందరు ఖైదీలు దాడి చేశారు. సరబ్జిత్ సింగ్‌ను చంపాలనే ఉద్దేశ్యంతోనే అతడిపై దాడి చేసినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది.
ఇక సరబ్జిత్ సింగ్‌పై దాడికి పాల్పడిన సర్ఫరాజ్.. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. భారత్ చేసిన ప్రయత్నాలు విఫలంఇక తీవ్రంగా గాయపడి.. చావు బతుకుల మధ్య ఉన్న సరబ్జిత్ సింగ్‌ను మానవతా దృక్పథంతో విడుదల చేయాలని.. 2013 ఏప్రిల్ 29 వ తేదీన స్వదేశానికి పంపించాలని పాకిస్థాన్‌కు భారత్ విజ్ఞప్తులు చేసింది. అయితే ఆ అభ్యర్థనలను పాకిస్థాన్ పదే పదే తిరస్కరించింది. ఇక జైలులో దాడి జరిగిన 6 రోజుల తర్వాత 2013 మే 1వ తేదీన ఆస్పత్రిలో గుండెపోటుతో సరబ్జిత్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు.
ఇక మృతదేహం భారత్‌కు తీసుకువచ్చిన తర్వాత పరిశీలిస్తే చంపాలనే ఉద్దేశంతోనే దాడి జరిగినట్లు తేలింది. సరబ్జిత్ సింగ్ శరీరం నుంచి గుండె, మూత్రపిండాలు, ఇతర అవయవాలను పాకిస్తాన్ తొలగించినట్లు తేలింది. అయితే శవపరీక్షలోనే వాటిని తీసేసినట్లు డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు. విడుదల అవుతాడనే ఆశచనిపోవడానికి ఏడాది ముందు సరబ్జిత్ సింగ్ జైలు నుంచి విడుదల అవుతాడనే ఆశ కలిగింది. సరబ్జిత్ సింగ్ మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ పాకిస్తాన్ అంతర్గత మంత్రిత్వశాఖ పంపిన పత్రంపై 2012 జూన్ 27 వ తేదీన అప్పటి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంతకం చేశాడు.
పాక్ నిబంధనల ప్రకారం జీవితఖైదు 14 ఏళ్లు కాగా.. అప్పటికే 22 జైలులో గడిపిన సరబ్జిత్ సింగ్ బయటికి వస్తారనే వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆయన స్వగ్రామంలో భారీగా వేడుకలు జరిగాయి. అంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది. జైలు నుంచి విడుదలయ్యే ఖైదీ పేరు సరబ్జిత్ సింగ్ కాదని.. సుర్జీత్ సింగ్ అని పాక్ సర్కార్ మెలిక పెట్టింది. సుర్జీత్ సింగ్‌ను కూడా గూఢచర్యం ఆరోపణలతోనే పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయితే భారత్ మాత్రం వాటిని ఖండించింది. సుర్జీత్ సింగ్.. సరబ్జిత్ సింగ్‌కి ఒకే రకమైన ఉర్దూ స్పెల్లింగ్స్ ఉండటమే ఈ గందరగోళానికి కారణమైనట్లు తెలిసింది.

READ ON APP