Hero Image

US: 40 ఏళ్ల కిందట హత్య కేసు.. హంతకుడ్ని పట్టించిన 'చూయింగ్ గమ్'!

నాలుగు దశాబ్దాల కిందటి ఓ హత్య కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. హంతకుడ్ని చూయింగ్‌ గమ్‌లోని డీఎన్‌ఏ నమూనాలు పట్టించడం గమనార్హం. దీంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విస్తుగొలిపే ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఓరెగాన్‌లోని మౌంట్‌ హూడీ కమ్యూనిటీ కాలేజీ విద్యార్ధిని 19 ఏళ్ల బార్బారా టక్కర్ 1980 జనవరిలో హత్యాచారానికి గురయ్యారు.
జనవరి 15న అపహరణకు గురైన ఆమె.. క్యాంపస్‌ పార్కింగ్‌ సమీపంలో శవమై కనిపించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టమార్టం జరిపించడంతో భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చారు. ఆమెపై అత్యాచారం చేసిన అనంతరం దారుణంగా హత్య చేసినట్లు వెల్లడయ్యింది.ఈ ఘాతుకానికి రాబర్ట్‌ ప్లింప్టన్‌‌ అనే వ్యక్తి పాల్పడినట్లు పోలీసులు అనుమానించారు. అతడిపై పలు అభియోగాలు నమోదుచేసినా.. సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసు నీరుగారిపోయింది. అయితే, 20 ఏళ్ల తర్వాత మళ్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
శవపరీక్ష సమయంలో బార్బారా నుంచి సేకరించిన నమూనాలను ఒరెగాన్‌ స్టేట్‌ పోలీస్‌ (OSP) క్రైమ్‌ ల్యాబ్‌కు పంపారు. అక్కడ నిపుణులు వాటిని విశ్లేషించి.. డీఎన్‌ఏ ప్రొఫైల్‌ను రూపొందించారు. అనంతరం రాబర్ట్‌పైనా నిఘా కొనసాగించారు. ఈ క్రమంలో అతడు 2021లో చూయింగ్‌ గమ్‌‌ను నమలడాన్ని పోలీసులు గమనించారు. దాన్ని సేకరించి ల్యాబ్‌ పరీక్షలకు పంపడంతో 2000లో రూపొందించిన డీఎన్‌ఏ ప్రొఫైల్‌తో సరిపోలింది. దీంతో హత్య కేసు ఓ కొలిక్కి వచ్చినట్టయ్యింది. అదే ఏడాది జూన్‌ 8న రాబర్ట్ ప్లింప్టన్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు..
డిటెన్షన్‌ సెంటర్లో నిర్బంధించారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇటీవల అతడిని దోషిగా నిర్దారించారు. కానీ, అతడు మాత్రం తాను నేరం చేయలేదని వాదిస్తున్నాడు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లనున్నట్లు అతడి తరఫు లాయర్లు పేర్కొన్నారు. దీంతో తుది తీర్పు జూన్‌లో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాబర్ట్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. కాగా, ఈ హత్య కేసులో సాక్షులు ఓ మహిళ ఒళ్లంతా గాయాలతో రక్తసిక్తమై సాయం కోసం చేతులు ఊపుతుండటం తాము చూశామని తెలిపారు. దూరం నుంచి ఆమె అరుపులు విన్నామని చెప్పారు.
ఇక, 40 ఏళ్ల తర్వాత నిందితుడ్ని గుర్తించడంతో టక్కర్ సోదరి సుసానా పాటర్ సంతోషం వ్యక్తం చేసింది. తమ సోదరికి న్యాయం జరిగిందని, ఇది చాలా మంచి వార్త అని అన్నారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని హంతకుడ్ని పట్టుకున్న దర్యాప్తు అధికారులపై ఆమె ప్రశంసలు కురిపించారు.

READ ON APP