Hero Image

Saudi Arabia: సౌదీ అరేబియా చరిత్రాత్మక నిర్ణయం.. మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనాలని నిర్ణయం

Saudi Arabia: సాంప్రదాయ ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియాలో ఇటీవల చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రౌన్ ప్రిన్స్‌గా మహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చినప్పటినుంచి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో మహిళల హక్కులకు ప్రాధ్యాన్యత లేని దేశంగా ఉన్న సౌదీ అరేబియా చరిత్రలోనే తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనబోతోంది.
సౌదీ అరేబియా అంటేనే పూర్తిగా ఇస్లామిక్ దేశం. అక్కడ ఆచారాలు, వ్యవహారాలు అన్నీ చాలా కఠినంగా ఉంటాయి. ఇక మహిళలపై మరిన్ని ఆంక్షలు ఉంటాయి. అయితే అలాంటి ఆంక్షలు, సంప్రదాయాలను పక్కన పెట్టి సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో తమ దేశం నుంచి కూడా ఒకరిని పోటీలో నిలపాలని నిర్ణయించింది. ఈ మేరకు తమ దేశం తరఫున 27 ఏళ్ల రుమీ అల్‌కతానీ పేరును సౌదీ అరేబియా నామినేట్‌ చేసింది. ఈ విషయాన్ని రుమీ అల్‌కతానీ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు.అయితే మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో సౌదీ అరేబియా పాల్గొనడం ఇది తొలిసారి అని రుమీ అల్‌కతానీ తన పోస్టులో పేర్కొన్నారు.
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు చెందిన రుమీ అల్‌కతానీ ఇప్పటికే మిస్‌ సౌదీ అరేబియా కిరీటం గెలుచుకుంది. ఇక ఆ మిస్ సౌదీ అరేబియానే మిస్ యూనివర్స్ పోటీలకు కూడా హాజరు కానున్నారు. సౌదీ అరేబియాకు చెందిన ప్రస్తుత క్రౌన్‌ ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సాద్‌ హాయంలో.. ఆ దేశంలో ఇలాంటి సంచలన, చరిత్రాత్మక నిర్ణయాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇస్లామిక్‌ దేశం అయిన సౌదీ అరేబియా తన సంప్రదాయ ముద్రను తొలగించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒక భాగమే అని స్థానికంగా వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక 73 వ మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీలు ఈసారి మెక్సికోలో జరగనున్నాయి. సెప్టెంబర్‌ 28 వ తేదీన జరగనున్న ఈ మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా తొలిసారి పాల్గొననుంది.
ఇటీవల మలేసియాలో నిర్వహించిన మిస్‌ అండ్‌ మిసెస్‌ గ్లోబల్‌ ఏషియన్‌ ఈవెంట్‌లో పాల్గొన్న రూమీ అల్‌కతానీ.. ప్రపంచ సంస్కృతుల గురించి తెలుసుకోవడంతోపాటు సౌదీ సంప్రదాయ, వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే తన ప్రయత్నమని పేర్కొన్నారు. మిస్ సౌదీ అరేబియా కిరీటం దక్కించుకోవడంతోపాటు ప్రాంతీయంగా నిర్వహించిన ఎన్నో అందాల పోటీల్లో రూమీ అల్‌కతానీ పాల్గొన్నారు. మిస్‌ మిడిల్‌ ఈస్ట్‌ (సౌదీ అరేబియా), మిస్‌ అరబ్‌ వరల్డ్‌ పీస్‌ 2021, మిస్‌ ఉమెన్‌ (సౌదీ అరేబియా) వంటి టైటిళ్లను కూడా అల్‌కతానీ తన ఖాతాలో వేసుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో రూమీ అల్‌కతానీకి 10 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

READ ON APP