Hero Image

Baltimore Bridge: బ్రిడ్జిని ఢీకొట్టిన నౌక.. నదిలో వాహనాలు పడి పలువురు మృతి.. షాకింగ్ వీడియో

Ship Hits Bridge: అమెరికాలో ఘోర ప్రమాదం జ‌రిగింది. మేరీల్యాండ్‌ రాష్ట్రంలోని బాల్టిమోర్‌ ప్రాంతంలో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. పటాపస్కో నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జిని ఓ భారీ కంటైనర్ షిప్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న వాహనాలు ఆ నీటిలో పడిపోయాయి. ఆ నౌక బ్రిడ్జిని ఢీకొట్టడం, దాంతో బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాలను అక్కడికి కొంత దూరంలో ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగ‌ళ‌వారం తెల్లవారుజామున ప‌టాప‌స్కో న‌దిలో ప్రయాణిస్తున్న ఒక భారీ నౌక.. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని ఢీకొట్టింది. సింగ‌పూర్ జెండా కలిగిన ఆ నౌక.. బాల్టిమోర్ నుంచి శ్రీలంక‌లోని కొలంబోకు ప్రయాణిస్తోంది. ఆ నౌక పేరు దాలి అని అధికారులు వెల్లడించారు.
నౌక ఢీకొట్టి బ్రిడ్జి కూలిపోవడంతో.. ఆ బ్రిడ్జి వైపుకు వచ్చే అన్ని రహదారులను మూసివేసిన‌ట్లు మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు పేర్కొన్నారు.
ఈ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న 7 వాహనాలు ఆ పటాపస్కో నదిలో పడిపోయినట్లు బాల్టిమోర్ సిటీ ఫైర్ శాఖ అధికారులు తెలిపారు. వాహనాల్లో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు ఆ నదిలో పడిపోయినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగినపుడు తీసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో ప్రస్తుతం వైర‌ల్ అవుతున్నాయి. అయితే మృతుల సంఖ్య ఖచ్చితంగా తెలియరాలేదని.. పటాపస్కో నదిలో గాలింపు చర్యలు చేపట్టామని ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత ఎంతమంది ఉన్నారు అనేది తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

READ ON APP